మహాభారత్ ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి పర్వ సినిమా

రామాయణ, మహాభారత, భాగవతాలు, హిందూ పురాణగాధల ఆధారంగా ఎవరెన్నిసార్లు ఎన్ని భాషలలొ సినిమాలు తీసినా బాగుంటే ప్రజలు చూస్తూనే ఉంటారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి    మహాభారత గాధని ‘పర్వ’ అనే పేరుతో మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత, పద్మభూషన్ గ్రహీత డాక్టర్ ఎస్.ఎల్. భైరప్ప మహాభారత గాధపై 17 ఏళ్ళపాటు లోతుగా అధ్యయనం చేసి రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని రచించారు. అది దాదాపు అన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్, రష్యన్, మాండేరియన్, చైనీస్ భాషల్లో కూడా అనువదించబడింది. 

ఆ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వివేక్‌ అగ్నిహోత్రి ట్విట్టర్‌లో తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలియజేస్తూ కురుక్షేత్రంలో అర్జునుడికి భాగవద్గీత భోదిస్తున్న శ్రీకృష్ణుడు ఫోటోతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో పాటు పోస్ట్ చేసిన మరో చిన్న వీడియో క్లిప్పింగ్‌లో మహాభారత్ పౌరాణిక గాధ లేక చరిత్ర?అంటూ ప్రశ్నించడం గమనిస్తే, దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి దీనిని పూర్తి పౌరాణికగాధగా తీయబోవడం లేదని అర్దమవుతుంది.

వివేక్‌ అగ్నిహోత్రి తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’, ఇటీవల విడుదలైన ‘ది వాక్సిన్ వార్’ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. విభిన్నమైన కధాంశాలను ఎంచుకొని వాటిని విలక్షణంగా తెరకెక్కించగల సమర్దుడైన దర్శకుడుగా నిరూపించుకొన్న వివేక్‌ అగ్నిహోత్రి మహాభారతాన్ని ఎలా చూపిస్తాడో?