మహేష్‌ బాబుతో సినిమా అంతా గ్యాస్

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత రాజమౌళితో రెండు మూడేళ్ళవరకు లాక్ అయిపోతారు. కనుక గుంటూరు కారం పూర్తవగానే రాజమౌళితో సినిమా మొదలు పెట్టేముందు మద్యలో మరో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. 

ఏజంట్, భోళా శంకర్ సినిమాలతో దాదాపు రూ.100 కోట్లు నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకర కోసం మహేష్‌ బాబు ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అనిల్ రావిపూడి స్పందిస్తూ, “గుంటూరు కారం తర్వాత మహేష్‌ బాబు రాజమౌళి సినిమాలోనే నటించబోతున్నారు. మద్యలో మరో సినిమా ఏదీ చేయడం లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నాకు మహేష్‌ బాబుతో మంచి అనుబందం ఏర్పడింది. కనుక నేను మహేష్‌ బాబుని రెండు మూడు వారాలకోసారి కలుస్తుంటాను. కానీ మా మద్య ఈ చర్చ ఎప్పుడూ రాలేదు. ఒకవేళ మహేష్‌ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను,” అని అన్నారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా ఈ నెల 19న దసరాకు విడుదల కాబోతోంది. అది హిట్ అయితే మహేష్‌ బాబు అనిల్ రావిపూడికి అవకాశం ఇస్తారేమో? ఎందుకంటే రాజమౌళి సినిమా మొదలయ్యేందుకు ఇంకా మరో 7-8 నెలలు సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కనుక గుంటూరు కారం పూర్తి చేసిన తర్వాత మహేష్‌ బాబుకి కనీసం 4-5 నెలల సమయం మిగిలి ఉంటుంది. కనుక కుదిరితే చేస్తారేమో?