టైగర్ నాగేశ్వర రావు తమిళ వెర్షన్ హక్కులు ఎవరికంటే

మాస్ మహరాజ్ రవితేజ ప్రధాన పాత్రలో టైగర్ నాగేశ్వర రావు సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తీసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దీని తమిళ్ వెర్షన్ హక్కులను తమిళనాడులో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకొంది. ఆ సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో ఈవిషయం ప్రకటించింది. కోలీవుడ్‌లో అనేకమంది పెద్ద హీరోలతో స్టూడియో గ్రీన్ అనేక సినిమాలు చేసింది. కనుక టైగర్ నాగేశ్వర రావు తమిళ్ వెర్షన్ హక్కులను ఆ సంస్థ తీసుకోవడంతో తమిళనాడులో థియేటర్ల కోసం టైగర్ నాగేశ్వర రావు వెతుక్కోవలసిన అవసరం ఉండదు.

స్టువర్టుపురం బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కధ ఆధారంగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించింది. నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, నాజర్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్ పేరడీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాలో రేణూ దేశాయ్ ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రను చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వంశీ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: మాధే, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ చేశారు.       

ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో నిర్మించిన టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.