కన్నప్పలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ కూడా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో సిద్దమవుతున్న కన్నప్ప సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ కూడా ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో కన్నప్పని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని న్యూజిలాండ్‌లో షూటింగ్‌  చేస్తున్నారు. అక్కడే ఏకధాటిగా 5 నెలలపాటు సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకొని, హైదరాబాద్‌ నుంచే సెట్స్‌ అన్ని తయారుచేసుకొని కంటెయినర్లలో సముద్రమార్గం ద్వారా న్యూజిలాండ్‌కి తరలించారు.   

 ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా చేస్తున్నారు. నయనతార, మధుబాల, మలయాళ నటుడు మోహన్ లాల్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న. 

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించబోతున్నారు.