గేమ్ చేంజర్‌ నుంచి మొదటి పాట దసరాకి?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌, కియరా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్ ఇంకా ఎప్పుడు ముగుస్తుందో, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని పరిస్థితి నెలకొని ఉండటంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమా పూర్తి చేసిన తర్వాత ముందుగా రామ్ చరణ్‌ ఈ సినిమాను మొదలుపెట్టారు. ఆ తర్వాత చాలా నెలల తర్వాత జూ.ఎన్టీఆర్‌ కొరటాల శివతో దేవర మొదలుపెట్టి, అభిమానుల సహనాన్ని పరీక్షించకుండా ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి అదే లక్ష్యంతో  చకచకా షూటింగ్‌ పూర్తిచేస్తున్నారు.

కానీ రామ్ చరణ్‌తో రెండు పడవల ప్రయాణం చేస్తున్న శంకర్‌ని నమ్ముకొని సినిమా ఆలస్యం చేసుకొంటున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు గేమ్ చేంజర్‌కు లీకుల బెడద తప్పడం లేదు. ఇవన్నీ రామ్ చరణ్‌ అభిమానులకు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని కలిగించేవే.

కనుక ఈ దసరా పండుగకు గేమ్ చేంజర్‌ నుంచి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఇటీవల లీక్ అయిన పాటనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. 

గేమ్ చేంజర్‌లో అంజలి, ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా: తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్: సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.