నత్త నడకలతో గేమ్ చేంజర్‌?

రామ్ చరణ్,  శంకర్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌ అక్టోబర్ 2021లో మొదలు పెట్టారు. అంటే ఇప్పటికీ సరిగ్గా రెండేళ్ళు పూర్తయిందన్న మాట. అయినా ఇంకా ఈ సినిమా షూటింగ్‌ పూర్తవలేదు. ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో కూడా తెలీని పరిస్థితి.

కనుక వచ్చే జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదలవచ్చని సమాచారం. ఇంకా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో రామ్ చరణ్‌ అభిమానులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కనుక ఈ గేమ్ చేంజర్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే సినిమా షూటింగ్‌ నత్త నడకన సాగుతోంది.

పైగా సినిమాకి సంబందించి ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్, ఓ పాట లీకయ్యాయి. తాజాగా ఓ పాట మొత్తం లీక్ అయిపోవడంతో ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర క్రియెషన్స్ అప్రమత్తమై వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ పాటను తొలగింపజేసింది. అలాగే ఈ పాట చెన్నై నుంచి లీక్ అయిన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సెక్షన్ 66(సి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ నేపధ్యంలో మళ్ళీ నిన్నటి నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్లోనే మిగిలిన సన్నివేశాలన్నిటినీ పూర్తిచేయబోతున్నట్లు తెలుస్తోంది.  

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌ తండ్రికొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు గతంలో లీక్ అయిన ఫోటోల వలన స్పష్టమైంది. తండ్రి పాత్రకు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా: తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్: సంగీతం అందిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌ సినిమాను రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.