ప్రశాంత్ నీల్‌తో జూ.ఎన్టీఆర్‌ సినిమా ఎప్పటి నుంచంటే

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఆ తర్వాత దేవర రెండో భాగం ఎప్పుడు మొదలు పెడతారో తెలీదు కానీ ఆలోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ విషయం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి వీరి సినిమా మొదలవుతుందని తెలిపింది. ఈ డిసెంబర్‌లో ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా సలార్ విడుదలైపోతుంది కనుక జూ.ఎన్టీఆర్‌ దేవర పూర్తి చేసి వచ్చేలోగా సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేయవచ్చు.

దేవర మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదలవుతుంది కనుక రెండో వారం నుంచి జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్ మొదలుపెట్టడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 

దేవర సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఏప్రిల్ 5వ తేదీన దేవర ఖచ్చితంగా విడుదలచేయాలనే ఉద్దేశ్యంతో మరోవైపు పూర్తయిన భాగానికి ఎప్పటికప్పుడు వీఎఫ్ఎక్స్ పనులు కూడా చేయించేస్తున్నారు. 

దేవర సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు.