సెన్సార్ బోర్డు సభ్యులపై సీబీఐ కేసు నమోదు

కోలీవుడ్‌ నటుడు విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చేందుకు ముంబైలోని ఇద్దరు సెన్సార్ బోర్డు అధికారులు రూ.6.5 లక్షల లంచం వసూలు చేశారు.

ఈ విషయం విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వారి బ్యాంక్ అకౌంట్ నంబర్లతో సహా అన్ని వివరాలను పేర్కొన్నారు. ఈ లంచాల వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారానే కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో, కేంద్రం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. వెంటనే రంగంలో దిగిన సీబీఐ విశాల్ పేర్కొన్న సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. 

విశాల్ ఫిర్యాదుపై సెన్సార్ బోర్డు కూడా స్పందిస్తూ, ఇకపై ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తామని తెలిపింది. నిర్మాతలందరూ ఇకపై సెన్సార్ బోర్డ్ పోర్టల్ ‘ఈ-సినీ ప్రమాణ్’లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

సెన్సార్ బోర్డ్ ఏడాదికి సుమారు 12-18,000 సినిమాలను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్లు ఇస్తుంటుందని కనుక ప్రతీ సినిమాను చూసి సర్టిఫికేట్ జారీ చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అయితే కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను త్వరగా క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తుంటారని తెలిపింది. 

కొన్ని కోట్ల నుంచి వందల కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు, సెన్సార్ బోర్డులో ఏ వంకతోనైనా కొర్రీలు వేయగలదు. కనుక అక్కడ లంచాలకు అవకాశం ఏర్పడుతుందని వేరే చెప్పక్కరలేదు. విశాల్ సినిమాకే రూ.6.5లక్షలు లంచం వసూలు చేసిన్నట్లు రుజువైంది. ఆ లెక్కన ఏడాదికి12-18,000 సినిమాలకుగాను సెన్సార్ బోర్డు సభ్యులకు ఎంత అక్రమ సంపాదన ఉంటుందో లెక్క కట్టడం కష్టం.

అలవాటు ప్రకారం విశాల్ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు సభ్యులు లంచడం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. అయితే సెన్సార్ బోర్డులో లంచాలకు అలవాటుపడిన కొందరిపై చర్యలు తీసుకొన్నంత మాత్రాన్న ఇక్కడితో ఈ సమస్య శాస్వితంగా తీరిపోతుందనుకోలేము.