భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలో లిరికల్

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా నుంచి ఉయ్యాలో ఉయ్యాలో అంటూ సాగే మరో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. తండ్రీ కూతుర్ల అనుబంధాన్ని వివరిస్తూ సాగే ఈ పాటను థమన్ చక్కగా స్వరపరచగా ఎస్పీ చరణ్ మృధుమధురంగా పాడారు.

ఈ సినిమాలో బాలకృష్ణ, కాజల్ కూతురుగా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో శ్రీలీల బాల్యం నుంచి తండ్రి సంరక్షణలో ఎదిగిన సన్నివేశాలను చూపగా, ఇంతకు ముందు విడుదల చేసిన గణేశ్ ఏంథమ్ సాంగ్‌లో శ్రీలీల యుక్తవయసులో తండ్రితో కలిసి చేసిన డాన్స్ చూపారు. అయితే ఇప్పటి వరకు తండ్రీకూతుర్లను మాత్రమే చూపిస్తున్నారు తప్ప కాజల్ అగర్వాల్‌ని చూపకుండా దాచిపెడుతున్నారు.

తాజాగా విడుదల చేసిన పాటలో కూతురు బాల్యం నుంచి పెద్దమనిషి అయ్యే వరకు చూపిన సన్నివేశాలలో కూడా బాలకృష్ణను మాత్రమే చూపారు తప్ప ఎక్కడా తల్లిగా నటించిన కాజల్ అగర్వాల్‌ని చూపలేదు. అంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అతిధి పాత్రకే పరిమితం కానుందా?అనే సందేహం కలుగుతోంది.       

ఈ నెల 8వ తేదీన ట్రైలర్‌ విడుదలచేయబోతున్నారు. దానిలో కాజల్ అగర్వాల్‌ని ఎందుకు దాచి పెట్టారో అర్దమవవచ్చు. అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు. 

ఈ సినిమాలో రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.