
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 2-3 ఏళ్ళు సమయం పట్టే ఓ భారీ సినిమాలో నటించబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. 2024 ఆగస్ట్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకొన్నారు. కానీ ఇంకా ఆలస్యం అవవచ్చని తెలుస్తోంది.
నవంబర్ నెలాఖరులోగా గుంటూరు కారం షూటింగ్ పూర్తయిపోతుంది. కనుక రాజమౌళితో సినిమా ప్రారంభించేలోగా మహేష్ బాబు మరో సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా అంటేనే భారీ బడ్జెట్‌తో తీసే పెద్ద సినిమాగా ఉంటుంది.
కనుక దానిని పూర్తిచేయడానికి కనీసం ఏడాది సమయం అవసరం ఉంటుంది. అయితే మహేష్ బాబుకి అంత సమయం ఉండదు. తప్పనిసరిగా రాజమౌళి సినిమా మొదలుపెట్టేలోగా అంటే 5-6 నెలలో దానిని పూర్తిచేయాల్సి ఉంటుంది.
అంతవేగంగా మహేష్ బాబుతో సినిమాను పూర్తిచేయగల సత్తా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో కొత్త సినిమా చేయవచ్చని తెలుస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే మహేష్ బాబు కొత్త సినిమాపై ప్రకటన రావచ్చు.