మోకాలి ఆపరేషన్ కోసం ప్రభాస్ సినిమాలకు బ్రేక్?

పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి, సలార్ పార్ట్-1, ఇంకా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ సినిమా చేస్తున్నప్పుడే ప్రభాస్ మోకాలు నొప్పితో చాలా బాధపడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రభాస్‌ వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో అసలు విశ్రాంతి లభించకపోవడంతో మోకాలి నొప్పి ఇంకా ఎక్కువైనట్లు తెలుస్తోంది. 

కనుక వైద్యుల సూచన మేరకు ప్రభాస్ తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి మోకాలు శస్త్రచికిత్స కోసం త్వరలో యూరప్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మోకాలి శస్త్ర చికిత్స తర్వాత ప్రభాస్ కనీసం 3-4 నెలలు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది కనుక అంతవరకు ఆయన చేస్తున్న ఈ మూడు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది.

వాటిలో కల్కి, సలార్ రెండూ చాలా భారీ బడ్జెట్ సినిమాలే కనుక వాటి షూటింగ్‌ నిలిచిపోతే సినిమా రిలీజ్ కూడా ఆలస్యమవుతుంది. దాంతో నిర్మాతలకు చాలా నష్టం కలగవచ్చు. కానీ ప్రభాస్ తరపున ఇంతవరకు ఎవరూ ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు.