విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తన కొడుకు హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ అభిషేక్‌కు తన పారితోషికంలో సగం వెంటనే ఇచ్చేశాడని చెప్పారు.
“ఆ సినిమా చేసినందుకు అభిషేక్ నా కొడుకుకి హైదరాబాద్‌లో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తానంటే దానిని తను తీసుకోలేదు. కానీ ఇంతకాలం ఈవిషయం మేము ఎవరికీ చెప్పుకోలేదు. కానీ అప్పటి నుంచే అభిషేక్ మా అబ్బాయి విజయ్ దేవరకొండని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఓసారి విజయ్ దేవరకొండ మార్కెట్ పడిపోయిందని, ఇక అతనికి సినిమా ఛాన్సులు రావని అందరికీ చెపుతుంటాడు. మళ్ళీ అతనే మాకు ఫోన్ చేసి విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలనుకొంటున్నానని చెపుతాడు.
సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే మా అబ్బాయికి ఇవన్నీ తెలియవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే డబ్బు ఇమ్మనమని అడగడంతో నేను స్పందించక తప్పడం లేదు. మేము ఇవ్వగలిగినంత ఇచ్చేశాము. ఇంకా కావాలనుకొంటే వెళ్ళి ఆ సినిమా నిర్మాతతో మాట్లాడుకోవాలి. అంతే కానీ మా వెంటపడటం సరికాదు. ఒకవేళ మేము ఆయనకు అన్యాయం చేశామనుకొంటే కోర్టుకు వెళ్ళి తేల్చుకోవచ్చు. ఇకపై మా అబ్బాయి అభిషేక్‌తో ఎన్నడూ సినిమాలు చేయడు. ప్రస్తుతం దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ సంస్థలతో మూడు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకొన్నాడు. కనుక ఇంకా బిజీ అయిపోతాడు,” అని విజయ్ దేవరకొండ తండ్రి చెప్పారు.