జైలర్ నటుడు మారిముత్తు గుండెపోటుతో మృతి

రజనీకాంత్ ప్రధానపాత్రలో ఇటీవల వచ్చిన జైలర్ సినిమాలో విలన్‌ గ్యాంగ్‌లో నటించిన కోలీవుడ్‌ నటుడు మారిముత్తు (58) శుక్రవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ఓ తమిళ టీవీ సీరియల్ కోసం స్టూడియోలో డబ్బింగ్ చెపుతున్నప్పుడు హటాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది ఆయనను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు చెప్పారు. 

మారిముత్తు వందకు పైగా సినిమాలలో హాస్యనటుడిగా, విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. జైలర్ సినిమాలో కీలకపాత్ర చేశారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ చేస్తున్న భారతీయుడు-2లో కూడా మారిముత్తు నటిస్తున్నాట్లు సమాచారం. ఈరోజు ఉదయం సీరియల్ కోసం డబ్బింగ్ సన్నివేశం గుండెపోటుకి సంబందించినదే కావడం విశేషం. ఆ సన్నివేశానికి డబ్బింగ్ చెపుతుండగానే మారిముత్తు గుండెపోటుతో చనిపోయారు. మారిముత్తు మృతిపట్ల కోలీవుడ్‌లో అందరూ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.