నెట్‌ఫ్లిక్స్‌లో భోళాశంకర్‌ ఎప్పటి నుంచంటే...

చిరంజీవి, తమన్నా, కీర్తిసురేష్ ప్రధానపాత్రలలో భోళాశంకర్‌ ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదలై బోర్లాపడింది. ఎప్పుడో విడుదలైన తమిళ సినిమాకు రీమేక్ కావడం, చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు మెహర్ రమేష్ దానిని మాస్ మసాలా సినిమాగా తెరకెక్కించడంతో సినిమా విడుదలైన మొదటిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకొంది. వాల్తేర్ వీరయ్య కాస్త పర్వాలేదనిపించుకొంది కానీ భోళాశంకర్‌ మాత్రం పూర్తిగా బోర్లా పడటంతో అటు చిరంజీవి, ఇటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. 

ఈ సినిమా విడుదలై నెలరోజులు కావస్తుండటంతో ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్దమవుతోంది. వినాయక చవితి కానుకగా ఈ నెల 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు ఓటీటీలో కూడా పోటీ ఉండబోతోంది. రజనీకాంత్‌ తాజా చిత్రం జైలర్ గురువారం అర్దరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. జైలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.