సలార్ డిసెంబర్‌కు వాయిదా?

ప్రభాస్‌, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ‘సలార్’ ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించవలసి ఉంది.  

జూలై 6న విడుదలైన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచడంతో అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రిలీజ్‌ డిసెంబర్‌కు వాయిదా పడినట్లయితే అందరికీ తీవ్ర నిరాశ తప్పదు.    

సలార్‌లో జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్‌ నటుడు టినూ ఆనంద్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.   

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898-ఎడి చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898-ఎడి జనవరి 12న విడుదల కావలసి ఉండగా అది కూడా ఆలస్యం కావచ్చని  తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా డీలక్స్’ రొమాంటిక్ కామెడీ సినిమాకు సంబందించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నారు.