రాఘవ లారెన్స్ తాజా చిత్రం చంద్రముఖి-2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని ఓ విద్యాసంస్థకు చెందిన ఆడిటోరియంలో జరిగింది. లోపల కార్యక్రమం జరుగుతున్నప్పుడు, రాఘవ లారెన్స్‌కు భద్రత కల్పించే బౌన్సర్ ఒకరు ఆడిటోరియం బయట ఓ విద్యార్ధిపై చెయ్యి చేసుకొన్నాడు.
ఈ దాడికి సంబందించి వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాఘవ లారెన్స్ స్పందిస్తూ, “ఈ ఘటన గురించి నాకు తెలిసింది. మేము ఆడిటోరియం లోపల ఉన్నందున బయట జరిగిన ఈ ఘటన గురించి మాకెవరికీ తెలియలేదు. నేను విద్యార్థులను ఎంతగా ప్రేమిస్తానో అందరికీ తెలిసిందే. వారు జీవితంలో వృద్ధిలోకి రావాలని ఎప్పుడూ కోరుకొంటాను. ఇలాంటి ఘటనలను నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. నేను ఎప్పుడూ అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకొంటాను. కారణం ఏదైనప్పటికీ మరొకరిపై దాడి చేయడం సరికాదు. ముఖ్యంగా విద్యార్థులపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాను. ఇందుకు నేను అందరినీ క్షమాపణలు కోరుకొంటున్నాను. ఇకపై బౌన్సర్స్ ఇటువంటి పనులు చేయవద్దని సూచిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ రాఘవ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో చంద్రముఖి-2తో సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రముఖి-2లో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో నిర్మిస్తున్న చంద్రముఖి-2 సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.