
తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయంకృషితోనే మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనతో యూవీ క్రియేషన్స్ కొత్త సినిమా చేయబోతున్నట్లు నిన్న ప్రకటించింది. ఈ సినిమాకు ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ అందించిన వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి కొత్త సినిమాకు సంబందించి పూర్తి వివరాలను మంగళవారం ఉదయం 10.53 గంటలకు తెలియజేస్తామని యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.
దీంతో పాటు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్ చాలా ఆసక్తిరేకెత్తిస్తుంది. ఓ కొండ గుహలో బండరాళ్ళపై అత్యంత విషపూరితమైన నల్లతేలుని చూపుతూ, “అనేక అద్భుతమైన జీవులున్న ఈ ఈ విశాల విశ్వంలో ఒక వ్యక్తి అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తాడు,” అంటూ ఈ సినిమాలో చిరంజీవి గురించి ఏదో ఉంటుందని చెప్పింది.
చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత వాల్తేర్ వీరయ్యతో గట్టెక్కిన్నప్పటికీ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళాశంకర్ అట్టర్ ఫ్లాప్ అవడంతో చిరంజీవి అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. చిరంజీవి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయకుండా ఎప్పటివో పాత తమిళ్, మలయాళం రీమేక్ సినిమాలు చేస్తుండటం వలననే ఎదురుదెబ్బలు తింటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనుక ఇప్పుడైనా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకొంటూ ఈ కొత్త సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.