చిరంజీవి మోకాలికి చిన్న శస్త్ర చికిత్స...


మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్‌ సినిమా పూర్తిచేయగానే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఓ ఆర్ధోపెడిక్ హాస్పిటల్లో మోకాలి నొప్పి ఉపశమనం కొరకు చిన్న శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. కానీ ఎటువంటి కోతలు లేకుండా ఆర్థోస్కోపిక్ పద్దతిలో మోకాలి చిప్పలో పేరుకుపోయిన నీటిని తొలగించారు. దీనిని వైద్య పరిభాషలో ‘నీ వాష్’ అంటారు. వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స తర్వాత వారం రోజులు ఢిల్లీలో వారి పర్యవేక్షణలోనే ఉంటూ రోజూ నడుస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌ తిరిగి వచ్చి ఆగస్ట్ 22న తన పుట్టినరోజునాడు బంగార్రాజు ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన తదుపరి సినిమాని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది. 

చిరంజీవి మోకాలి నొప్పితో చాలా రోజులుగా బాధపడుతున్నప్పటికీ, సినిమా షూటింగ్‌ కారణంగా ఇంతవరకు గ్యాప్‌ దొరకలేదు. భోళాశంకర్‌ తర్వాత కొంచెం గ్యాప్‌లో తీసుకొని ఈ శస్త్ర చికిత్స చేయించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో ఇప్పుడు సాధ్యపడింది. అయితే మరో రెండువారాల వరకు మోకాలిపై ఒత్తిడి పెట్టవద్దని వైద్యులు సూచించడంతో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఆ తర్వాతే మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది.