
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘దేవర’ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవర సినిమాలో ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు భైర. ఓ వైపు కొండలు మరో వైపు అలలతో ఎగిసిపడుతున్న సముద్రంలో మూడు పడవలలో మనుషులు మద్యలో నల్లటి దుస్తులలో సైఫ్ ఆలీఖాన్... పోస్టర్ భీభత్సంగా ఉంది.
దేవర టైటిల్ పోస్టర్లో కూడా ఎన్టీఆర్ నల్లటి దుస్తులలో చేతిలో రక్తం కారుతున్న సొర చేపలను వేటాడే బల్లెంవంటి ఆయుధం పట్టుకొని ఆలలు ఎగసి పడుతున్న సముద్రం వైపు గంభీరంగా చూస్తున్నట్లు చూపారు. ఈ సినిమా కధ అంతా సముద్రం మీదే సాగుతుందని సూచిస్తున్నట్లుంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్కి జోడీగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.