ది సౌల్ ఆఫ్ సత్య ... రెండు మనసుల పాట!

సాయి ధరం తేజ్, కలర్స్ స్వాతి జంటని ఎవరూ ఊహించలేరు. కానీ వారిద్దరూ ది సౌల్ ఆఫ్ సత్య సినిమాలో భార్యభర్తలుగా నటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ్ళ ఆ సినిమా నుంచి నాలో ఒక చిన్న బిడియమే మొదలైందే... అంటూ కమ్మగా సాగే వీడియో సాంగ్‌ని కొద్దిసేపటి క్రితం రిలీజ్‌ చేశారు. ఆ ఒక్క పాటలోనే సినిమా కధ అంతా చెప్పేశాడు దర్శకుడు నవీన్ విజయ్‌ కృష్ణ. 

ఓ పల్లెటూరు అమ్మాయి... పెళ్ళి చేసుకొని హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటున్న భర్తతో కాపురానికి రావడం, అప్పుడు ఆమెలో సహజంగా కలిగే భయం, బిడియం, ఆ తర్వాత క్రమంగా భర్తతో సాన్నిహిత్యం, అన్ని హావభావాలను స్వాతి చాలా చక్కగా చూపింది. ఆ తర్వాత వారి వారి ప్రేమానురాగాలు, ఆమె నిండు గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతునట్లు చూపించడంతో ఆమె పరిస్థితికి జాలి కలుగుతుంది. కానీ అతను ఓ ఆర్మీ జవాన్. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ పోరాడుతున్నట్లు చూపడంతో అసలు కధ అర్దమవుతుంది. అక్కడ హీరో ఉగ్రవాదులతో పోరాడుతుండగా, ఇక్కడ అతని భార్య ఒంటరిగా ప్రసవవేదన అనుభవిస్తూ పిల్లాడిని కంటుంది. ఇది వీడియో సాంగ్‌ అని చెప్పినప్పటికీ సినిమా ట్రైలర్‌లాగే ఉంది. 

దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హన్షిత కలిసి నిర్మిస్తున్న ది సౌల్ ఆఫ్ సత్య సినిమాకి డైలాగ్స్: కడలి, సంగీతం: సాకేత్ కొమండూరి, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యన్, యాక్షన్: రాబిన్ సుబ్బు, ఆర్ట్: అవినాష్ కొల్ల. 

ది సౌల్ ఆఫ్ సత్య సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనేది ఇంకా తెలియవలసి ఉంది.