ఇంతకాలం హాస్య నటుడు పృధ్వీ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ హీరోలుగా వచ్చిన బ్రో సినిమాలో కేవలం ఒక్క నిమిషం సేపు శ్యాంబాబు పాత్రలో తళుక్కుమని కనిపించి ఇప్పుడు ‘శ్యాంబాబు’ అనే మరో కొత్త బిరుదు సంపాదించుకొన్నారు.
ఏపీ సాగునీటిశాఖ మంత్రి అంబటి రాంబాబుని అనుకరిస్తూ పృధ్వీ చేసిన డ్యాన్సే అందుకు కారణం. దానిపై ఏపీలో ఎంత రచ్చజరుగుతోందో బహుశః అందరూ చూస్తూనే ఉన్నారు. బ్రో సినిమాలో కేవలం ఒక్క నిమిషమే శ్యాంబాబుగా పృధ్వీ కనిపించినప్పటికీ, అదే ఇప్పుడు ఆయనకు మరో సినిమా అవకాశాన్ని తెచ్చి పెట్టింది.
ఆ సినిమా పేరు ‘శోభన్‌బాబు’ అని దానిలో శ్యాంబాబు పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని పృధ్వీ స్వయంగా చెప్పారు. అంటే ఆ సినిమాలో పృధ్వీ లీడ్ రోల్ చేయబోతున్నారన్నమాట. ఓ ప్రముఖ దర్శకుడు, రచయిత తనకు ఈ ఆఫర్ ఇచ్చాడని పృధ్వీ చెప్పారు. త్వరలోనే ఆ సినిమా వివరాలు తెలియజేస్తానని చెప్పారు.
బ్రో సినిమాలో కేవలం ఒక్క నిమిషం ఏపీ మంత్రి అంబటి రాంబాబుని అనుకరిస్తూ పృధ్వీ స్టెప్పులు వేసినందుకే ఆయనతో సహా ఏపీ మంత్రులందరూ భగభగ మండిపోతుంటే, ఇప్పుడు ఆయనపై ఏకంగా రెండు గంటల పూర్తి సినిమా తీస్తే మరింకెంత రచ్చ అవుతుందో ఊహించుకోవచ్చు.