పుష్ప ఎక్కడ? మైత్రీ మూవీ మేకర్స్‌ నిద్రపోతోందా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా చేస్తున్న పుష్ప-2 సినిమా అప్‌డేట్ గురించి చాలారోజులుగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమాకి సంబందించి ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఏపీ, తెలంగాణతో సహా కేరళ, ఒడిశా రాష్ట్రాలలో అల్లు అర్జున్‌ అభిమానులు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు.

సోషల్ మీడియాలో కూడా ‘వేకప్ టీమ్‌ పుష్ప’ అనే హ్యాష్ ట్యాగ్‌ ద్వారా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థను అభిమానులు నిద్రలేపుతున్నట్లు కార్టూన్స్ పెట్టి మరీ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ట్విట్టర్‌లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌ ద్వారా ఇప్పటివరకు 55 వేలమందిపైగా అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తక్షణమే పుష్ప-2 అప్‌డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. కొందరైతే “కొడకల్లారా మీరుగాని దొరికితే ఒక్కొక్కరికీ తాట తీస్తానంటూ” హెచ్చరిస్తున్నారు. 

ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మంగళవారం) ఆయన పుట్టినరోజు. కనుక రేపైనా తప్పనిసరిగా పుష్ప-2 అప్‌డేట్ విడుదల చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. 

పుష్ప-1 డిసెంబర్‌ 17, 2021లో రిలీజ్‌ అయ్యింది. అంటే ఏడాదిన్నరపైనే అన్నమాట. పుష్ప-2 తీస్తున్నట్లు ప్రకటించకపోయుంటే అభిమానులు ఏమనుకొనేవారు కాదు. కానీ పుష్ప-1 కంటే గొప్పగా పుష్ప-2 తీస్తామంటూ సినిమా మొదలుపెట్టి ఏడాదిన్నర అనుతున్నా పూర్తిచేయకపోగా కనీసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పుష్ప-1 డిసెంబర్‌లో విడుదలైంది కనుక పుష్ప-2 ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు అది ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియక చాలా అసహనంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ మేల్కొని అప్‌డేట్ ఇస్తుందో లేదో?