ప్రముఖ నటి సమంత మయొసైటీస్ అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని చికిత్స కోసం ఆమె ఓ ప్రముఖ హీరో వద్ద నుంచి రూ.25 కోట్లు అప్పు తీసుకొందని మీడియాలో వార్తలు వచ్చాయి.
వాటిపై ఆమె స్పందిస్తూ, “మయోసైటీస్ చికిత్సకు 25 కోట్లు ఖర్చు అవుతుందా?మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను సినిమాల ద్వారా సరిపడా సంపాదించుకొన్నాను దానిలో చిన్న మొత్తంతో నేను చికిత్స చేయించుకొంటున్నాను తప్ప నేనెవరి దగ్గర అప్పు తీసుకోలేదు. మయొసైటీస్ అనేది ఓ రకమైన ఆరోగ్య సమస్య. దాంతో ఈ ప్రపంచంలో వేలాదిమంది బాధపడుతున్నారు. ఇటువంటి విషయాల గురించి వ్రాసేటప్పుడు కాస్త బాధ్యతగా మెలగాలని” విజ్ఞప్తి చేస్తూ తన గురించి సోషల్ మీడియాలో వస్తున పుకార్లకు చెక్ పెట్టింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన కుషీ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా మురళి జి, సంగీతం హషమ్ అబ్దుల్ వాహేబ్ అందిస్తున్నారు.