శేఖర్ కమ్ముల సినిమా వస్తోందోచ్!

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్, ఓ ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అటువంటి దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఏ రెండేళ్ళకో మూడేళ్ళకో ఓ సినిమా తీస్తున్నా అవి ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటాయి. కనుక హిట్ అవుతుంటాయి. రెండేళ్ళ క్రితం అంటే 2021లో లవ్‌స్టోరీ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల అదృశ్యమైపోయారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన పేరు వినబడింది. అదీ... ఓ తమిళ సినిమా హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా! 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తన 51వ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా గురించి చాలా రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఇవాళ్ళ ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ ఒకటి విడుదల చేశారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ వైపు ధనవంతులు ఉండే పెద్దపెద్ద భవంతులు, మరోవైపు పేదవారి గుడిసెలు మద్యలో పెద్దగోడలాగ పాతనోట్ల కట్టను చూపారు. 

బారీ బడ్జెట్‌తో డి51 వర్కింగ్ టైటిల్‌తో శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నారాయణదాస్, కె సునీల్ నారంగ్, పి రామ్మోహన్ కలిపి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.