
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బ్రో సినిమా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక రేపు అంటే శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 25న హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో బ్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజకు జోడీగా కేతిక శర్మ నటించింది. ఈ సినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కాలచక్రం (దేవుడు)గా నటిస్తుంటే, సాయిధరం తేజ్ మార్క్ (మార్కండేయులు)గా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.