అమెరికాలో శాన్ డియోగోలో కామిక్ కాన్ ఫెస్టివల్లో రానా తదుపరి సినిమా ‘హిరణ్యకశిప’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్ కధ అందిస్తున్నారు. స్పిరిట్ మీడియాతో కలిసి రానా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే వాస్తవానికి ఇది రానా-గుణశేఖర్‌ల డ్రీమ్ ప్రాజెక్టు. ఈ విషయం గుణశేఖర్ స్వయంగా పలుమార్లు చెప్పుకొన్నారు కూడా. అయితే ఇప్పుడు హటాత్తుగా తన ప్రమేయం లేకుండా వేరేవారితో రానా ఈ సినిమా చేసేందుకు సిద్దం అవుతుండటంతో గుణశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సమయానికే గుణశేఖర్‌కి ఈ విషయం తెలిసినట్లుంది. అందుకే అప్పుడు, “నేను హిరణ్యకశిప చేయాలని మీ (రాన)వద్దకు వచ్చినప్పుడు నచ్చితే నాతో చేయాలి లేదంటే మానేయాలి. కానీ నా ప్రాజెక్టుని వేరే వాళ్ళతో చేయాలనుకోవడం సరికాదు. ఈవిషయంలో నాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. అవతలివారు ఎంతవరైనా చివరి వరకు పోరాడుతాను,” అంటూ హెచ్చరించారు.
అయినా రానా హిరణ్యకశిప సినిమాను చేస్తున్నట్లు ప్రకటించడంతో గుణశేఖర్ మళ్ళీ మరోసారి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “భగవంతుడిపై ఓ సినిమా చేస్తున్నప్పుడు, మనల్ని ఆ భగవంతుడు గమనిస్తుంటాడని గ్రహించాలి. అనైతికంగా వ్యవహరిస్తే నైతికంగా జవాబు లభిస్తుంది,” అని సందేశం పెడుతూ ఇదివరకు తాను అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొన్నప్పుడు తీసిన ఫోటోను పెట్టారు. అంటే హిరణ్యకశిప ప్రాజెక్టు గురించే తాను ఈ సందేశం పెట్టానని చెప్పకనే చెప్పారు. మరి రానా ఏవిదంగా స్పందిస్తారో?