
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ కలిసి నటించిన బ్రో ఈ నెల 28న విడుదల కాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, ఆ తర్వాత ఢిల్లీలో ఎన్డీయే సమావేశానికి వెళ్ళిరాడంతో ఏమాత్రం తీరికలేకుండా ఉన్నారు. దీంతో బ్రో ఎటువంటి హడావుడి, ప్రమోషన్స్ లేకుండానే విడుదలవుతోంది.
ఈనెల 25న విశాఖపట్నంలో బ్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వాటిని ధృవీకరించలేదు. పైగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రభుత్వం బ్రో సినిమాకి బ్రేకులు వేయడానికి కాసుకు కూర్చోంది. బ్రో సినిమా ప్రమోషన్స్ లేవు. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు. బెనిఫిట్ షోలు ఉండవు. దీంతో బ్రో పరిస్థితి ఏమిటో అర్దంకాకుండా ఉంది.
అయితే బ్రోకి ఢోకా ఉండదని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు అభిమానులు అందరూ బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అమెజాన్‌లో బ్రో టీషర్ట్స్ అందుబాటులోకి తెచ్చామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్లో తెలియజేసింది.
బ్రో సినిమాలో సాయిధరం తేజ్ మార్క్ (మార్కండేయులు)గా నటిస్తున్నాడు. ఓ ప్రమాదంలో మార్క్ చనిపోయిన తర్వాత మన మోడ్రన్ దేవుడి రూపంలో బ్రో అతనికి కొంతకాలం పునర్జన్మ ప్రసాదిస్తాడు. దానిని అతను సద్వినియోగం చేసుకొన్నాడా లేక వృధా చేసుకొన్నాడా? అనేదే ఈ సినిమా కధ. సముద్రఖని నటించి స్వీయదర్శకత్వం తమిళంలో తీసిన ‘వినోదాయ సితం’ సినిమాకు బ్రో తెలుగు రీమేక్. దీనిలో కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.