హిరణ్యకశిపుడిగా దగ్గుబాటి రాన

దర్శకుడు గుణశేఖర్, రానాల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశిప’ సినిమాలో రానా ఫస్ట్-లుక్‌ వచ్చేసింది. అమెరికాలో శాన్‌డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ వేడుకలలో ఈ సినిమా ప్రకటన వెలువడింది. స్పిరిట్ మీడియాతో కలిసి ఈ సినిమాను చేయబోతున్నట్లు వెల్లడించారు.  అమరచిత్ర కధ కామిక్ బుక్ కధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు గుణశేఖర్ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్‌ కధ అందించబోతున్నారు. 

ఇదికాక లార్డ్స్ ఆఫ్ డెక్కన్ అనే చారిత్రిక వెబ్‌ సిరీస్‌ కూడా చేయబోతున్నట్లు స్పిరిట్ మీడియా ప్రకటించింది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చాళుక్యుల చరిత్రను ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా తెరకెక్కించబోతున్నారు. దీనిని సోనీలివ్‌తో కలిసి నిర్మించబోతున్నట్లు స్పిరిట్ మీడియా ప్రకటించింది. త్వరలోనే వీటి గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

ఇదే కధతో తెలుగులో ‘భక్త ప్రహ్లాద’ సినిమా చాలా దశాబ్ధాల క్రితమే వచ్చింది. ఆరోజుల్లోనే అది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. నేటికీ టీవీలో ఆ సినిమా ఎప్పుడు వచ్చినా తెలుగువారు తప్పక చూస్తుంటారు. శ్రీమహావిష్ణువుని ద్వేషించే రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువుని పరమ భక్తుడు. శ్రీమహావిష్ణువు పట్ల ఆ తండ్రీకొడుకుల ద్వేషం, భక్తి ప్రధానంగా ఆ కధ సాగి చివరికి నరసింహస్వామి చేతిలో హిరణ్యకశిపుడు చనిపోవడంతో కధ ముగుస్తుంది.

తండ్రీకొడుకుల ద్వేషం, భక్తిని భక్త ప్రహ్లాదలో అద్భుతంగా ఆవిష్కరించారు కనుక నేటికీ ఆ సినిమా తెలుగువారి హృదయాలలో నిలిచి ఉంది. కనుక ఆ కధతో రానా చేయబోతున్న ఈ సినిమా ఆ స్థాయిలో నిలుస్తుందా లేక మరో ఆదిపురుష్‌ అవుతుందో చూడాలి.