తాజాగా విడుదలై హిట్ అయిన సినిమాలలో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన, ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ ఉన్నాయి. వాటిలో ముందుగా అంటే జూన్ 29న విడుదలైన సామజవరగమన ఓటీటీలోకి కూడా ముందుగానే వచ్చేస్తోంది. ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోందంటూ ఆ సంస్థ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి ఆహాలో స్త్రీమింగ్ అవుతుందో చెప్పలేదు. సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన నెలరోజులకు ఓటీటీలోకి రావడం ఆనవాయితీ కనుక జూలై 28వ తేదీన ఆహా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
కధేమిటంటే, నరేష్, శ్రీవిష్ణు తండ్రీకొడుకులు. కొడుకు డిగ్రీ పాస్ అయితే ఆస్తి కలిసి వస్తుందని నరేష్ ఆరాటపడుతుంటాడు. కానీ బాలు (శ్రీవిష్ణు) చదువుల్లో అంతంతమాత్రమే. ఓ మల్టీ ప్లెక్స్ లో పనిచేస్తూ తండ్రి పోరు భరించలేక డిగ్రీ సప్లిమెంటరీ వ్రాస్తున్నప్పుడు సరయూ (రెబా మోనికా)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. మద్యలో బాలు బావ ఎంట్రీ ఇవ్వడంతో వారికి ఓ సమస్య ఎదురవుతుంది. అది పరిష్కరించుకొని వారు పెళ్ళి చేసుకొంటారా లేదా?బాలు డిగ్రీ పాస్ అయ్యి, తాత ఆస్తి దక్కించుకొంటాడా లేదా? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవలసిందే.
కధ చాలా పాతదే అయినప్పటికీ దర్శకుడు రామ్ అబ్బరాజు కామెడీని సరైన మోతాదులో వాడుకోవడంతో అందరికీ తెగ నచ్చేసింది. దాంతో సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఆహాలోకి వచ్చేస్తోంది కనుక ఆహా.. ఓహో అనుకోవలసిందే.