సితార సినిమాలలోకి గౌతమ్ అప్పుడే కాదట!

మహేష్ బాబు, నమ్రతల పిల్లలు గౌతమ్, సితారల గురించి వారి తల్లి నమ్రతా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. పిఎంజె అనే బంగారు ఆభరణాల సంస్థ కోసం సితార ‘ప్రిన్సస్ సితార లిమిటెడ్ ఎడిషన్’ పేరిట కొన్ని బంగారు ఆభరణాలకు సంబందించి వాణిజ్య ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. ఈరోజు తల్లితో కలిసి మీడియా ముందుకు వచ్చిన సితార అదే తాను చేసిన మొట్ట మొదటి వాణిజ్య ప్రకటన అని చెప్పింది. అయితే ఆ సొమ్ము మొత్తం ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చేశానని చెప్పింది. అయితే అది ఎంతో చెప్పలేదు కానీ చాలా బారీ మొత్తమే. దానిలో ఒక్క రూపాయి కూడా తన కోసం ఉంచుకోకుండా, ఖర్చు చేసుకోకుండా మొత్తం సొమ్ముని విరాళంగా ఇచ్చేయడం చాలా ప్రశంశనీయమే. 

ఇక తాను నటించిన ఈ వాణిజ్య ప్రకటన న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శిస్తున్నట్లు తనకు తెలియదని, తన తండ్రి మహేష్ బాబు చొరవ తీసుకొని అక్కడ తన వాణిజ్య ప్రకటన వచ్చేలా చేసి ఓ మరిచిపోలేని గొప్ప బహుమతిని అందజేశారని సితార చెప్పింది. 

సినిమాల విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఆమె తల్లి నమ్రత స్పందిస్తూ, సీతారా చిన్నప్పటి నుంచే డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ చాలా యాక్టివ్‌గా ఉండేదని, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉందని చెప్పారు. సితార సినిమాలలోకి రావాలని ఆసక్తి చూపిస్తోందని కానీ దానికి కొంత సమయం పడుతుందన్నారు. గౌతమ్ కూడా భవిష్యత్‌లో ఏదో ఓ రోజున తప్పకుండా సినిమాలో నటుడుగా ప్రవేశించవచ్చని నమ్రత చెప్పారు. 

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం, త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో, గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలకాబోతోంది. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఇండియానా జోన్స్ వంటి ఓ సాహసయాత్ర కధతో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ 2024 ఏప్రిల్-మే నెలల్లో మొదలయ్యే అవకాశం ఉంది.