రష్మిక మా ఫ్యామిలీ లెక్క: ఆనంద్ దేవరకొండ

గీతాగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు కలిసి నటించినప్పటి నుంచి వారిద్దరి మద్య ప్రేమాయణం సాగుతోందని ఊహాగానాలు వినిపిస్తునే ఉన్నాయి. వాటిని వారిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. కానీ జనం మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే వారికి అలా అనుమానం కలిగేలా చేస్తున్నదే వారు కనుక. 

ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా శనివారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బేబీ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మందన కూడా పాల్గొంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న కారణంగా రష్మిక మందన, నితిన్‌-వెంకీ కుడుముల సినిమాను వదులుకొంది. అంత బిజీగా ఉన్నా తాను నటించని బేబీ సినిమా ప్రమోషన్స్‌ కోసం రావడంతో మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. 

విలేఖరులు వారి ప్రేమ విషయం గురించి ఆనంద్ దేవరకొండను ప్రశ్నించగా, “రష్మిక మందన మా ఫ్యామిలీలో మెంబర్ వంటిది. ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా తప్పకుండా మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండి వెళుతుంటుంది. మా అన్న, రష్మిక మంచి స్నేహితులు మాత్రమే,” అని అన్నారు. 

అయితే ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను ‘వదినా వదినా...’ పిలుస్తూ ఆటపట్టిస్తే ఆమె చిర్నవ్వులు చిందిస్తూ ఆస్వాదించిందే తప్ప వారిపై చిర్రుబుర్రులాడలేదు. అంటే ఆమె కూడా కన్ఫర్మ్ చేసేసినట్లే అనుకోవచ్చు. అయితే ఎప్పుడు ధృవీకరిస్తారో చూడాలి.