నాని-మృణాల్ సినిమా పేరు హాయ్ నాన్న!

నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో చాలా రఫ్ అండ్ టఫ్‌గా కనిపించాడు. మళ్ళీ తన ఒరిజినల్ గెటప్‌లోకి వచ్చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్‌తో కలిసి చేస్తున్న కొత్త సినిమా టైటిల్‌ ఈరోజు ప్రకటించి, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. కొత్త దర్శకుడు శౌర్యన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇది తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామా అని ముందే చెప్పేశారు. 

అయితే ఈరోజు విడుదలైన పోస్టర్‌ చూస్తే, నాని ఏదో కారణాల వలన భార్యతో విడిపోయి కూతురుతో కలిసి జీవిస్తుంటే, హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్‌ పరిచయం అయిన తర్వాత వారి ముగ్గురు మద్య జరిగే కధే ఈ సినిమా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ప్రధానంగా తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తోనే సాగబోతోందని టైటిల్‌తో మరోసారి చెప్పేశారు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సగంపైగా పూర్తయిపోయింది.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి, కెఎస్ మూర్తి కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీషామ్ అబ్దుల్ వాహబ్:  సంగీతం, సను జాన్ వర్గీస్: ఫోటోగ్రఫీ, ప్రవీణ్ ఆంటోనీ: ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 21న విడుదల కాబోతోంది.