నేనూ మల్లారెడ్డిలానే కష్టపడ్డా... వీడియోలు జేసినా!

తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఆట, పాట, మాట గురించి అందరికీ తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వ్యాపారాలు మళ్ళీ ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నా అసలు ఏ ఒత్తిడీ లేనట్లు హాయిగా నవ్వుతూ నవ్విస్తుంటారు. అందుకే మిమిక్రీ ఆర్టిస్టులు  ఆయనని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. 

విషయానికి వస్తే మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి తాజాగా అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కనుక ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ కాలేజీకి వెళ్ళి విద్యార్థులతో కబుర్లు చెప్పారు. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ మల్లారెడ్డిని అనుకరిస్తూ తన సినిమా కెరీర్‌లో గురించి చెప్పారు. ఇంతకీ నవీన్ పోలిశెట్టి ఏం చెప్పాడంటే, “మీ పెద్దాయన మల్లారెడ్డి సర్ ఉంటారేమో అనుకొని వచ్చాను. అయన స్టైల్,  స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఆయనలాగే చాలా కష్ట పడ్డా. ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినాయి... ఎట్లచ్చినాయి? నేనేమైన మాయ జేషినానా, మంత్రం జేషినానా... చాలా కష్ట పడ్డా... స్కిట్లు రాషినా, యూట్యూబ్ లో వీడియోలో జేషినా... అనుష్కతో హీరోగా జేషినా... సక్సెస్ అయినా,” అంటూ చెప్పేసరికి విద్యార్థులు హాయిగా నవ్వుకొన్నారు.