లైగర్ పంచ్ దెబ్బలతో ఢీలాపడిన పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు కోలుకొని రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది గతంలో వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్. బుదవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని ‘పూరి కనెక్ట్స్’ ప్రకటించింది. అంతే కాదు... ఈ సినిమా షూటింగ్ ప్రారంభించక మునుపే 2024, మార్చి 8న మహాశివరాత్రినాడు ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది.
ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తున్నాడు. అది సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. అది పూర్తిచేసేలోగానే ఇప్పుడు ఈ సినిమా కూడా మొదలుపెట్టేస్తున్నాడు. స్కందను పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతోంది కనుక ఒకవేళ అది హిట్ అయితే పూరీ-రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’పై అంచనాలు పెరిగేందుకు తోడ్పడుతుంది.
ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మించబోతున్నారు. దీనిని కూడా తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. అంటే పూరీ-ఛార్మీ మరోసారి ప్రయోగానికి సిద్దం అవుతున్నారనుకోవచ్చు.