మహేష్ బాబుతో సినిమా పూర్తికాగానే మహాభారతమే

రామాయణ, మహాభారత, భాగవతాలు కోట్లాదిమంది హిందువుల జీవితాలతో పెనవేసుకుపోయాయి. దశాబ్ధాలుగా భారతీయ సినీ పరిశ్రమ కూడా వాటి నుంచి స్పూర్తి పొందుతూ ఎన్నిసార్లు సినిమాలుగా తీసి చూపుతున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. కనుక భారతీయ సినీ పరిశ్రమలో ప్రతీ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటీనటులు తమ జీవితంలో ఒక్కసారైనా వాటితో సినిమాలు చేయాలని తపిస్తుంటారు. 

ఆర్ఆర్ఆర్‌తో భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్ అవార్డ్ సాధించిన రాజమౌళి కూడా మహాభారతం సినిమా తీయాలని చాలా ఏళ్ళుగా అనుకొంటునారు. అయితే అంతపెద్ద కధాంశం ఉన్న మహాభారతంని ఒకే ఒక్క సినిమాలో చూపించాలనుకొంటే కధకు పూర్తి న్యాయం జరగదని కనుక తాను మహాభారతం తెరకెక్కించానుకొంటే కనీసం 10 భాగాలలో తీస్తానని రాజమౌళి స్వయంగా చెప్పారు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలుపెడతానో చెప్పలేనని అన్నారు. 

కానీ త్వరలో మహేష్ బాబుతో మొదలుపెట్టబోతున్న ఇండియానా జోన్స్ వంటి అడ్వంచర్ మూవీని పూర్తిచేశాక మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని ఆయన తండ్రి, ఆయన సినిమాలన్నిటికీ కధలు అందించే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను రెండు భాగాలలో తీయాలనుకొంటున్నట్లు ఆయన ఇదివరకు చెప్పారు. 

రాజమౌళి ఒక్కో సినిమా షూటింగ్‌ పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ళ పైనే సమయం తీసుకొంటారని అందరికీ తెలుసు. ఆ లెక్కన మహేష్ బాబుతో రెండుభాగాలుగా సినిమా 204లో మొదలుపెడితే 2030 నాటికి అది పూర్తవుతుంది. మద్యలో ఓ ఏడాది సినిమా రిలీజ్‌, ప్రమోషన్స్, ఆస్కార్ కోసం హాలీవుడ్‌లో హంగామా కోసం మరో ఏడాది కలుపుకొంటే 2031 అవుతుంది.

 ఆ తర్వాతే మహాభారతం మొదలుపెడతారన్న మాట! మళ్ళీ మహాభారతాన్ని ఒక్కో భాగానికి మూడేళ్ళు చొప్పున తీయడం మొదలుపెడితే పది భాగాలకు కలిపి 30 ఏళ్ళు పడుతుంది. అంటే రాజమౌళికి 85-90 ఏళ్ళు వయసు వచ్చేవరకు తీస్తూనే ఉండాలి. అంతవరకు మరో సినిమా చేయలేరు కనుక రాజమౌళి మహాభారతం మొదలుపెడతారో లేదో? అనే సందేహం కలుగుతోంది.