గోపీచంద్ మలినేనితో రవితేజ మరో సినిమా

మాస్ మహారాజ్ రవితేజ తనకు మూడు హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా ప్రారంభించబోతున్నాడు. గోపీచంద్ మలినేని ఈ ఏడాదిలో ‘వీరసింహా రెడ్డి’తో నందమూరి బాలకృష్ణకు తొలి హిట్ అందించారు. ఇదివరకు రవితేజ డాన్ శీను, బలుపు, క్రాక్ మూడూ హిట్స్ ఇచ్చారు. పుష్పతో హిట్ కొట్టి దానికి సీక్వెల్‌గా పుష్ప-2 తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. కనుక ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉంటాయి. 

రవితేజ, గోపీ చంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ నాలుగో సినిమాకి ‘ఆర్‌టి4జిఎమ్’ వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ విడుదల చేశారు. మంటల్లో తగులబడుతున్న ఓ గ్రామంలో ‘రేడియేషన్’ ఉందని సూచిస్తూ డేంజర్ అని వ్రాసున్న ఓ హెచ్చరిక బోర్డుని చూపడంతో ఈ సినిమా కధపై ఆసక్తి పెంచారు. 

ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలలో భారీగా ఉన్న యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించి స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన విరమించుకొంది. భూమిలో ఎంత యురేనియం నిక్షేపాలున్నప్పటికీ వాటిని వెలికి తీయనంతవరకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఒకసారి వెలికితీస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తీవ్రమైన రేడియేషన్‌కు గురవుతాయి. అప్పుడు ప్రకృతి, మనుషులు, పశుపక్షాదులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి ఇదే ఈ సినిమా కధగా తీసుకొన్నట్లు కనిపిస్తోంది. విలన్లు, హీరో మద్య యుద్ధం జరగడానికి ఇంతకంటే గొప్ప కారణం ఏం కావాలి? ఇలాంటి కధ రవితేజకు సరిపోతుంది కూడా. ఈ సినిమాని ఇప్పుడే ప్రకటించారు కనుక త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. 

వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈలోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ అనే మరో సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.