
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ప్రదాన పాత్రలలో నటించిన ‘బ్రో’ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల విడుదలైన టీజర్ బ్రో సినిమాపై అంచనాలు పెంచేసింది.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కాలచక్రం (దేవుడు)గా నటిస్తుంటే, సాయిధరం తేజ్ మార్కండేయులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓ మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం జీవించేందుకు అవకాశం వస్తే’ అనే కాన్‌సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కనుక సినిమాలో మంచి భావోద్వేగాలు, కామెడీ పుష్కలంగా ఉంటాయని భావించవచ్చు.
“ఫస్ట్ సింగిల్ ఆఫ్ మై డియర్ మార్కండేయులు... లోడింగ్” అంటూ ఈ సినిమాలో సాయి ధరం తేజ్ మీద చిత్రీకరించిన మొదటిపాటను త్వరలో విడుదల చేయబోతున్నామని సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పకుండా సస్పెన్స్ పెట్టారు.
ఈ సినిమాలో కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలలో నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. అయితే తెలుగు నేటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా కధలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి సాయిధరం తేజ్ పాత్రను కొత్తగా జోడించి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారిరువురి పోస్టర్ చూసి అభిమానులు చాలా పొంగిపోతున్నారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.