
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జోడీగా చేస్తున్న భోళాశంకర్ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేశానని చిరంజీవి ఫోటోతో సహా ట్వీట్ చేసి అభిమానులకు చాలా సంతోషం కలిగించారు.
“ఈ సినిమా చక్కగా రూపొందిన తీరు చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఇది మాస్ ఆడియన్స్ కోసమే ప్రత్యేకంగా తీసినది కనుక ఈ సినిమా వారిని తప్పకుండా మెప్పిస్తుందని భావిస్తున్నాను. కనుక మీ క్యాలండర్లలో ఆగస్ట్ 11వ తేదీని భోళాశంకర్ సినిమా కోసం మార్క్ చేసుకోండి. అప్పుడు కలుద్దాం,” అంటూ ట్వీట్ చేశారు.
భోళాశంకర్ సినిమాలో కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో సుశాంత్, మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య ఆకెళ్ళ, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ. వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి వేరే జోనర్‌లో ప్రయత్నించకుండా మళ్ళీ మరో మాస్ మసాలా మూవీతో వస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.