సలార్ టీజర్‌తో మరో విషయం కూడా చెప్పేశారుగా

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా నటిస్తున్న సలార్ సినిమా అభిమానులకు నిద్ర లేకుండా చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా టీజర్‌ ఈరోజు ఉదయం 5 గంటలకు విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు అలారం పెట్టుకొని మరీ నిద్రలేచి టీజర్‌ చూశారు. సలార్ వారి అంచనాలకు మించే సినిమా ఉండబోతోందని టీజర్‌ స్పష్టం చేసింది. 

బాలీవుడ్‌ సీనియర్ నటుడు టినూ ఆనంద్‌ని విలన్‌ గ్యాంగ్ తుపాకులతో చుట్టుముట్టినప్పుడు ఆయన చాలా తాపీగా “సింపల్ ఇంగిలీష్... నో కన్ఫ్యూజన్... లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్‌ జూరాసిక్ పార్క్... బికాజ్ ఇన్‌ దట్ పార్క్ దేరీజ్.... అంటూ హీరో ప్రభాస్‌ ఎలివేషన్ సీన్ అద్భుతంగా చూపారు. టీజర్‌లో ప్రభాస్‌ని చివరిలో మలయాళ నటుడు విలన్‌ పృధ్వీరాజ్ సుకుమారన్‌లను మాత్రమే చూపారు. టీజర్‌లో ఇది ‘పార్ట్-1 సీజ్ ఫైర్’ అని చూపడం ద్వారా ఈ సినిమా పార్ట్-2 కూడా ఉంటుందని స్పష్టం చేశారు. 

సలార్‌లో విలన్‌ రాజమన్నార్‌గా జగపతి బాబు, మరో విలన్‌గా పృధ్వీరాజ్ సుకుమారన్‌, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, తమిళ నటి శ్రీయరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.  

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. సలార్ ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు టీజర్‌లో మరోసారి ధృవీకరించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.