సమంత కొంతకాలం సినిమాలు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్, విజయ్ దేవర కొండతో ఖుషీ సినిమా చేస్తోంది. ఈ రెండు పూర్తి చేసిన తర్వాత మరికొన్ని సినిమాలు చేయడానికి ఆమె అడ్వాన్స్ కూడా తీసుకొంది.
కానీ మయొసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న ఆమె తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఒక ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా విశ్రాంతి, చికిత్స తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఓ హిందీ సినిమాతో సహా మరికొన్నిటికి తీసుకొన్న అడ్వాన్స్ నిర్మాతలకు వాపసు చేసినట్లు తెలుస్తోంది.
సమంత ప్రధాన పాత్రలో ‘యశోద’ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, సినిమా పెద్దగా ఆడలేదు. దాని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో సమంత చాలా నిరాశ చెందింది. తన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఎంతో కష్టపడి చేసిన రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో సమంత కొంతకాలం బ్రేక్ తీసుకోవడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఖుషీ సినిమా హిట్ అయితే ఆమె తన నిర్ణయం మార్చుకోవచ్చు లేకుంటే సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం ఖాయమే అని తెలుస్తోంది.
తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సమంతకు వైవాహిక జీవితం దెబ్బ తినడం, ఆ తర్వాత అరుదైన మయొసైటీస్ వ్యాధి బారిన పడటం, సినిమాలు ఫ్లాప్ అవుతుండటం చూస్తే ఆమె గ్రహస్థితి ఏమాత్రం బాగోలేదనిపిస్తుంది.
వైవాహిక జీవితం దెబ్బ తిన్నాక కూడా ఆమె ఎంతో నిబ్బరంగా జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడినప్పుడు, మయొసైటీస్ రూపంలో దేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. దానినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొని పోరాడుతున్నా సినిమాలు విఫలం అవుతుండటం తట్టుకోవడం కష్టమే. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఇప్పుడు ఈవిదంగా ఒంటరి పోరాటం చేయవలసి రావడం చాలా దురదృష్టకరమే... చాలా బాధాకరమే కదా?