కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం బ్రో!

మెగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరం ప్రధానపాత్రలలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రో' సినిమా టీజర్ నిన్న సాయంత్రం విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో చిన్న సాంకేతిక సమస్య కారణంగా విడుదల చేయలేకపోయారు. కానీ ఆ కొద్ది సేపటి తర్వాత బ్రో టీజర్‌ విడుదల చేశారు.   

ఈ సినిమాలో మార్కండేయులుగా నటిస్తున్న సాయిధరం తేజ్ “ఏంటి ఇక్కడ ఇంత చీకటిగా ఉంది? ఎవరైనా ఉన్నారా? హలో మేస్టారు... గురువుగారు... హలో తమ్ముడూ... బ్రో... అని పిలవడంతో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ ఇవ్వడం బాగుంది. వెల్‌కమ్ బాస్ వెల్‌కమ్... కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం... అంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన డైలాగ్‌, వారిద్దరి మద్య కామెడీ... మెగా అభిమానులకు పండగే        

బ్రో సినిమాలో కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ కాలచక్రం (దేవుడు)గా నటిస్తుంటే, సాయిధరం తేజ్  మార్కండేయులుగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఓ మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మరోసారి కొంతకాలం జీవించేందుకు అవకాశం లభిస్తే ఏవిదంగా ప్రవర్తిస్తాడు? అంతకు ముందు జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకొంటాడా?లేక మళ్ళీ అలాగే ప్రవర్తిస్తాడా? అనే విలక్షమైన కధాంశంతో బ్రో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

గతంలో ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి కనుక సముద్రఖని ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలరా లేదా అనేది జూలై 28న సినిమా విడుదలైనపుడు తెలుస్తుంది. 

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. “కాలం.. మీ గడియారానికి అందని ఇంద్రజాలం...” అనే చిన్న డైలాగ్‌ వింటే మాటల మాంత్రికుడు సత్తా అర్దమవుతుంది. 

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.