
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్, కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘బ్రో’ సినిమా టీజర్ గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతోందని చిత్రా నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీని కోసం పవన్ కళ్యాణ్ భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలోనే డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కాలచక్రం (దేవుడు)గా నటిస్తుంటే, సాయిధరం తేజ్ మార్కండేయులుగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. అయితే తెలుగు నేటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా కధలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి సాయిధరం తేజ్ పాత్రను కొత్తగా జోడించి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారిరువురి పోస్టర్ చూసి అభిమానులు చాలా పొంగిపోతున్నారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.