
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో పర్యటిస్తుండగా కొద్దిగా జ్వరం రావడంతో వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చి రెండు రోజులుగా భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకొంటున్నారు. అయితే అలాగని ఆయన పూర్తిగా విశ్రాంతి కూడా తీసుకోవడం లేదు. అక్కడే పార్టీ కార్యాలయంలో తన నటించిన బ్రో సినిమాలో టీజర్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ సూచన మేరకు సినిమా దర్శకుడు సముద్రఖని డబ్బింగ్ పరికరాలతో భీమవరం చేరుకొని జనసేన కార్యాలయంలోనే వాటిని ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ అక్కడే డబ్బింగ్ పని పూర్తి చేశారు. ఈ ఫోటోలను సముద్రఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. జూలై 28న బ్రో సినిమా విడుదల చేయబోతున్నందున త్వరలోనే టీజర్ విడుదల చేయవలసి ఉంది. అందుకే భీమవరంలోనే ఆ పని పూర్తి చేశారు.
నిన్న మంగళవారమే పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ఇద్దరూ కలిసున్న మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అది చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరం తేజ్ పాత్ర పేరు మార్కండేయులు. ఈ సినిమాలో కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.