
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ‘బ్రో’ సినిమా నుంచి నేడు మరో పోస్టర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలో ఇద్దరూ ఇద్దరూ కలిసున్న మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిలో పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ఇద్దరూ లుంగీలు పైకి ఎగ్గట్టుకొని పైకి చూస్తున్నట్లు చూపారు.
ఇద్దరినీ రైల్వే కూలీలుగా చూపుతూ వారి చేతులకు లైసెన్స్ ప్లేట్స్, ఎర్రచొక్కా, ఎర్రకండువాలతో పోస్టర్‌లో చూపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్ చూసి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’ని గుర్తుచేసిందని అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఇటీవల వాల్తేర్ వీరయ్య సినిమాలో ‘వేరీజ్ ది బాస్ పార్టీ...’ పాటలో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఊర్వశీ రౌతేలా, ఈ సినిమాలో మామ, అల్లుళ్ళతో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ పాటలోనే పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ ఈ వేషాలలో డ్యాన్స్ చేశారు.
తమిళ సినిమా ‘వినోదాయ సితం’లో సముద్రఖని కాలచక్రం (దేవుడు)గా నటించగా దాని తెలుగు రీమేక్‌గా వస్తున్న బ్రోలో పవన్ కళ్యాణ్ ఆ పాత్ర చేస్తున్నారు. అయితే తమిళ్ వెర్షన్‌లో సాయిధరం పాత్ర లేదు. తెలుగు వెర్షన్‌లో జోడించారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో వస్తున్నాడు.