
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా వస్తున్న భోళాశంకర్ టీజర్ శనివారం విడుదలైంది. టీజర్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్, ఫైట్స్ అభిమానులను తప్పకుండా అలరిస్తాయి.
అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ స్థాయిలో చిరంజీవిలోని కామెడీ టైమింగ్ వాడుకోవడంలో దర్శకులు ఎవరూ పెద్దగా దృష్టి పెడుతున్నట్లు లేదు. టీజర్‌లో విలన్లను చితకాబాదుతూ ‘ఎట్లిచ్చినా?’ అంటూ చేసిన చిన్న బిట్ చూస్తే ఆ విషయం అర్దమవుతుంది.
భోళాశంకర్‌లో చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా, హీరోయిన్ తమన్నా లాయర్‌గా నటిస్తున్నారు కనుక వారి మద్య మంచి కామెడీకి కూడా ఆస్కారం ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ మరి దానిని ఫోన్ ట్యాపింగ్ చేస్తాడో లేక నాలుగు ఫైట్లు నాలుగు డ్యాన్సులు నాలుగు పంచ్ డైలాగులతో సరిపెట్టేస్తాడో ఆగస్ట్ 11న సినిమా విడుదలైనప్పుడు తెలుస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుండగా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)ని తెలుగులో భోళాశంకర్ పేరుతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ అందిస్తున్నారు.