మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈనెల 20న ఆడబిడ్డను ప్రసవించిన సంగతి తెలిసిందే. తల్లీబిడ్డా ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకొన్న తర్వాత అపోలో వైద్యులు ఈరోజు వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పసిబిడ్డను పొత్తిళ్ళలో పెట్టుకొని భార్యతో కలిసి హాస్పిటల్ వద్ద మీడియాతో మాట్లాడారు.
“అపోలో హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది అందరూ నాభార్యని, పాపను చాలా బాగా చూసుకొన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మా కోసం దేవుడిని ప్రార్ధించిన వారందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మీ అందరి అభిమానం పొందుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు లేదా పాప పుడితే ఏం పేరు పెట్టాలో మేము ముందే నిర్ణయించుకొన్నాము. అయితే పాపకు పేరు పెట్టిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను,” అని రామ్ చరణ్ చెప్పారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయింది. దీనిలో కియరా అద్వానీ, అంజలి రామ్ చరణ్‌కు జోడీగా నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్ రత్నవేలు, థమన్ సంగీతం అందించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకొన్నారు. కానీ శంకర్ దర్శకత్వంలోనే కమల్‌హాసన్ హీరోగా సిద్దమవుతున్న భారతీయుడు-2 కూడా అప్పుడే విడుదల చేస్తుండటంతో, ఏప్రిల్ లేదా మే నెలల్లో గేమ్ ఛేంజర్ విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15న గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.