సలార్ మామూలుగా ఉండదు... మరో స్థాయిలో ఉంటుంది: శ్రీయారెడ్డి

ఆదిపురుష్‌ హంగామా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ‘సలార్’ మీద పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా వస్తున్న ఈ సినిమాలో శ్రీయారెడ్డి కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ఆమె ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు చెప్పింది. 

“సలార్ మామూలుగా ఉండదు. ఎవరూ ఊహించలేనివిదంగా మరో స్థాయిలో ఉంటుంది. ఇది కేజీఎఫ్ సినిమా కంటే చాలా గొప్పగా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం ‘గేమ్ ఆఫ్ ధ్రోన్స్’ సినిమాలో లాగా ఓ సరికొత్త ప్రపంచం సృష్టించారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్, యాక్షన్ నేను ఇదివరకు ఎన్నడూ చూడలేదు. అంత గొప్పగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌ని దర్శకుడు అద్భుతంగా చూపించారు. స్క్రీన్ మీద ప్రభాస్‌ కనబడిన ప్రతీసారి అభిమానులు ఆనందంతో చిందులు వేయకుండా ఉండలేరు. అంతా గొప్పగా ఉంటుంది ప్రభాస్‌ పాత్ర,” అని చెప్పింది. 

ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతోంది. దానికి 100 రోజులు ముందు నుంచి అంటే జూలై 15-18 తేదీల నుంచి ‘కౌంట్ డౌన్‌’ పేరుతో రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ వెరైటీగా సలార్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకొంటున్నారు. దీనిని రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.   

ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ అనే రొమాంటిక్ కామెడీ, నాగ్ నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె చేస్తున్న సంగతి తెలిసిందే.