కోలీవుడ్‌లో ఐదుగురు స్టార్ హీరోలపై బ్యాన్?

సినీ పరిశ్రమలో ఒకప్పుడు నిర్మాతలు, తర్వాత దర్శకులకే ప్రాధాన్యం ఉండేది. ఆ తర్వాత క్రమంగా హీరోల రాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడు ఎంత పెద్ద దర్శకనిర్మాతలైన ముందుగా హీరో చేత కధ ఓకే అనిపించుకొన్నాకనే సినిమా మొదలుపెట్టాలి. అన్నీ సిద్దం చేసుకొని హీరోలని ఎంపిక చేసుకొంటామంటే కుదర్దు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోల విషయంలో అయితే అసలే కుదరదు. అయితే నేటి యువహీరోలు భారీగా పారితోషికాలు పిండుకొంటున్నప్పటికీ దర్శకనిర్మాతలతో స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. 

కానీ కోలీవుడ్‌లో కొంతమంది హీరోలు నిర్మాతలకు సహకరించడం లేదు. దీంతో కోలీవుడ్‌ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామస్వామి అధ్యక్షతన నేడు చెన్నైలో నిర్మాతలు సమావేశమై ఈవిషయంపై చర్చించి, ఐదుగురు సీనియర్ నటులను సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపారు. దానితో పాటు ఇక ముందు నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందీ కలిగించమని హామీ పత్రం కూడా జత చేసి పంపాలని కోరారు. ఒకవేళ వారు అందుకు అంగీకరించకపోతే, నిర్మాతల మండలిలో ఎవరూ కూడా వారితో సినిమాలు తీయాకూడదని, వారితో ఇకపి ఎవరైనా నిర్మాతలు, దర్శకులు సినిమాలు చేయాలనుకొంటే తమకు తెలియజేయాలని ఆదేశించింది. నోటీసులు పంపినవారిలో సూర్య, విశాల్, శింబు, యోగిబాబు, ఆధర్వ ఉన్నట్లు సమాచారం.