భీమదేవరపల్లి బ్రాంచి ట్రైలర్‌... మరో బలగం అవుతుందా?

మూస సినిమాలకు అలవాటుపడిన తెలుగు సినీ పరిశ్రమలో కొత్తతరం దర్శకులు, రచయితలు, నటీనటులు ప్రవేశించడంతో సమాజం మూలాలను, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను, జీవనవిధానాలను, వారి పెద్దపెద్ద కష్టాలను, చిన్నచిన్న సంతోషాలను అద్భుతంగా ప్రేక్షకుల కళ్ళ ముందుంచుతున్నారు.

ఇటీవల వేణు దర్శకత్వంలో వచ్చిన చిన్న సినిమా బలగం ఆ కోవకు చెందినదే. తాజాగా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ పేరుతో తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో సాగే మరో సినిమా రాబోతోంది. రమేష్ చెప్పళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజిబాబు, ప్రసన్న, అభిరామ్, రూపా శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

శనివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచడం వలన చివరికి ప్రజలే ఏవిదంగా నష్టపోతున్నారో తెలియజేస్తూ ఈ సినిమా తీసిన్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది.

బలగం సినిమాలో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు చూపించగా, ఈ సినిమాలో ఓ సామాజిక సమస్యను చూపబోతున్నారు. అయితే తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో సినిమా చుట్టబెట్టేస్తే హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదని పలు సినిమాలు నిరూపించాయి. కనుక దర్శకుడు రమేష్ చెప్పళ్ళ ఈ కధాంశాన్ని మనసులకు హత్తుకొనేలా చెప్పగలిగితే ఇది మరో బలగం అవుతుంది. లేకుంటే ఓటీటీని వెతుక్కొంటూ వెళ్లిపోక తప్పదు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రమేష్ చెప్పళ్ళ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కె.చిట్టిబాబు, ఎడిటింగ్: బి.నాగేశ్వర్ రెడ్డి. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతోంది.