
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2లో, త్రివిక్రం శ్రీనివాస్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘ఆహా’ ఓటీటీ సంస్థ ‘ఆహా వీడియోస్’ పేరుతో సినిమాలు తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలియజేసింది. ప్రొడక్షన్ నంబర్:1గా అల్లు అర్జున్, శ్రీలీల జోడీగా 'అర్జున్ లీల' అనే సినిమా తీయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.
“అతను ఐకానిక్... ఆమె స్వప్నసుందరి... వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే. ఆహా ఒరిజినల్ తీయబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ శ్రీలీలని పరియచయం చేస్తున్నాము. అతి పెద్ద మూవీ పండుగ చేసుకొందామా? అయితే ‘టిసునామి’కి అందరూ సిద్దంకండి. ఆహా ఓటీటీని ఏఏలో విలీనం అయ్యింది@అల్లు అర్జున్,” అని దానిలో పేర్కొంది.
తర్వాత ‘అర్జున్ లీల’ పేరుతో ఓ చిన్న వీడియోని కూడా విడుదల చేసింది. దానిలో శ్రీలీల మెడపై ఓ రౌడీ కత్తి పెట్టి బెదిరిస్తుండగా పోలీస్ వేషంలో ఉన్న కమెడియన్ చమ్మక్ చంద్ర అతనికి రివాల్వర్ గురి పెట్టి ‘హ్యాండ్స్ అప్’ అంటాడు. అప్పుడు ఆ రౌడీ “ఆ... మరి దీని పీక మీద కత్తి ఎవడు పెడతాడు?” అని అడిగినప్పుడు “పోలీస్” అంటూ అల్లు అర్జున్ కారులో నుంచి దిగుతాడు.
“ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే. ఆహా ఒరిజినల్ ‘అర్జున్ లీల’... శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆహా యాప్లో...,” అని తెలియజేశారు. ఈ వీడియోకు ఆర్టిస్ట్ డైరెక్టరు: ఏఎస్ ప్రకాష్, కెమెరా: రవి కె చంద్రన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
అయితే ‘అర్జున్ లీల’ పేరుతో తీయబోయే ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఈరోజు 10 గంటలకు విడుదల చేయబోయే పూర్తి వీడియోలో దీనిపై స్పష్టత రావచ్చు. వారివురూ కలిసి చేసిన ‘అల వైకుంఠపురములో..’ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో ‘అర్జున్ లీల’ వస్తున్నట్లయితే అభిమానులకు ఇంతకంటే గొప్ప శుభవార్త ఏముంటుంది?